కామారెడ్డి, 24.07.2026
దేవునిపల్లి పోలీసులు భూమిని అక్రమంగా కబ్జా చేసి, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి, తప్పుడు ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నెం.316/2025లో భూమిని అక్రమంగా కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన కేసును దేవునిపల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కేసును లోతుగా విచారించారు. దర్యాప్తులో, దేవునిపల్లి వార్డు పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లో గల ప్లాట్ నెం.71 అసలు యజమాని ముక్తవరం వెంకటయ్య పేరుమీద ఉండగా, రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి తనపై ఉన్న అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో అక్రమంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని విక్రయించాలని కుట్ర పన్నినట్లు తేలింది.
ఈ కుట్రలో భాగంగా తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించి, తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామానికి చెందిన తన మామ సంగారెడ్డిని అసలు యజమాని ముక్తవరం వెంకటయ్యగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నటింపజేసి, తప్పుడు గుర్తింపు పత్రాలు, నకిలీ ఆధారాలు ఉపయోగించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం అదే స్థలాన్ని అసలు విషయాన్ని దాచిపెట్టి ఇతరులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్థలం పలువురి పేర్లకు వరుసగా రిజిస్ట్రేషన్ అయినట్లు విచారణలో తేలింది.











