రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైనన్ని సార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తానని ఆయన తెలిపారు. కరీంనగర్లో నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరమైన ప్రాజెక్టులకు ముందుగా అనుమతులు పొందకుండా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పనిచేస్తామని ఆయన చెప్పారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేంద్రంతో నిరంతరం చర్చలు జరపడం వల్ల ఇప్పటికే కొన్ని ఫలితాలు సాధించామని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి అవసరాల కోసం 170 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదలాయించే ప్రక్రియను ఆరు నెలల్లో సాధించామని ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయ రన్‌వే కింద రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు.











