అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో విచారణ పారదర్శకతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని ఆయన కోరారు.
మాజీ ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్లో, కేసు విచారణలో 'ప్రయోజనాల ఘర్షణ' ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలోని సీఐడీ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించలేరని వాదించారు. ముఖ్యమంత్రికి ఐపీఎస్ అధికారుల పనితీరును సమీక్షించే అధికారం ఉండటంతో, విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
గతంలో సీఐడీ ఈ కేసులో విస్తృతమైన ఆధారాలు సమర్పించినప్పటికీ, ప్రభుత్వం మారిన తర్వాత కేసును మూసివేసేందుకు ప్రయత్నించడంపై ఆర్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐడీ నుంచి తనకు అందిన క్లోజర్ రిపోర్ట్ కాపీని కూడా ఆయన ప్రస్తావించారు.
నిందితుడి పర్యవేక్షణలో విచారణ కొనసాగడం తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, అందువల్ల కేసును సీబీఐకి బదలాయించాలని ఆర్కే కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జరగనుంది.










