కొడంగల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముదిరాజుల ఆత్మగౌరవం కోసం పోరాడిన పండుగ సాయన్న స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో పండుగ సాయన్న జయంతి సభలో ఆయన ప్రసంగించారు. ముదిరాజులను బీసీ ఏ లోకి మార్చే అంశంపై క్యాబినెట్ లో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముదిరాజుల విశ్వసనీయతను, వారి చరిత్రను స్మరించుకుంటూ, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన పండుగ సాయన్న స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో పండుగ సాయన్న జయంతి సభలో ఆయన ప్రసంగించారు. నిజాం హయాంలో దొరలు, భూస్వాములు పేదల భూములను ఆక్రమిస్తుంటే, వారికి అండగా నిలిచి, దొరలకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసిన యోధుడు పండుగ సాయన్న అని సీఎం కొనియాడారు. సాయన్న ప్రజలకు ధాన్యం పంచడమే కాకుండా, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేసిన ఘనత కూడా ఆయనదేనని తెలిపారు. సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేసినప్పుడు, నాటి వనపర్తి మహారాణి పెద్ద ఎత్తున నిధులు చెల్లించి విడిపించారని, అయితే ఆయనను అన్యాయంగా హత్య చేశారని, ఆయన మరణించి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో ఆయన పాటలు వినిపిస్తున్నాయని సీఎం గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బ్రిటిష్ హయాంలో కుల గణన జరిగిందని, వందేళ్ల తర్వాత తమ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని, దీనివల్లే ప్రతి కులం తమ గళాన్ని బలంగా వినిపిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. కుల గణనలో తమ జనాభా తక్కువగా ఉందని భావించేవారు పూర్తి వివరాలు అందిస్తే లెక్కలు సవరిస్తామని హామీ ఇచ్చారు. లెక్కలు లేనందునే ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చలేకపోయారని, ఈ అంశంపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని, మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తామని, ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. జటిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని, బీసీ కుల గణన చేపట్టామని తెలిపారు.










