లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ ఈరోజు పునఃప్రారంభం కానుంది. నిన్న కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మహ్మద్ జావేద్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు తమ వాదనలను వినిపించాయి.
నిన్నటి చర్చలో, ప్రతిపక్ష నాయకులను సభలో మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకున్నారని, మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని డాక్టర్ జావేద్ ఆరోపించారు. స్పీకర్ నిష్పాక్షికత లోపించిందని ఆయన విమర్శించారు.
అయితే, ఈ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. స్పీకర్ సభను నిష్పాక్షికంగా నడిపించారని, ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ తీర్మానాన్ని తీసుకువచ్చాయని ఆయన అన్నారు. శివసేన, ఎల్జేపీ (ఆర్) సభ్యులు కూడా ప్రతిపక్షాల తీరును విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగాన్ని స్పీకర్ అడ్డుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీల సభ్యులు తీర్మానానికి మద్దతుగా మాట్లాడారు. చర్చ అసంపూర్తిగా ముగిసింది. అదే సమయంలో, రాజ్యసభలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరుపై చర్చ జరగనుంది.

