ప్రభుత్వం ఎమ్మెల్సీలకు రూ. లక్ష విలువైన గిఫ్ట్ కూపన్లు ఇవ్వడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి విమర్శించారు. శాసనమండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే ఈ కూపన్లను తాను తిరిగి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, బీఏసీ టైం టేబుల్ ప్రకారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ జరగాల్సిన సమయంలో, ఇతర అంశాల వైపు దారి మళ్లిస్తున్నారని గోపీమూర్తి ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేనందున అధికార పార్టీయే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, తమ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
శాసనమండలిలో ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ, తమలాంటి స్వతంత్ర ఎమ్మెల్సీల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, అంగన్వాడీలు, కేజీబీవీ సిబ్బంది, రైతుల సమస్యలపై అసలు చర్చ జరగడం లేదని ఆయన ఆరోపించారు.
ఎలాంటి చర్చలు జరగని మండలిలో ఎమ్మెల్సీగా తనకు ఇచ్చిన రూ.లక్ష విలువైన గిఫ్ట్ కూపన్లను తిరస్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాది పాటు టాటా సంస్థకు చెందిన 'క్రోమా' షోరూమ్‌లో రూ. లక్ష విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోమంటూ కూపన్లు ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నట్లుగా భావించి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
ఈ కూపన్లను శాసన మండలి జాయింట్ సెక్రటరీ విజయరాజుకు సోమవారం తిరిగి ఇచ్చేశారు.










