భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పై 2006 నాటి ఆరోపణలపై కేరళ ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు, మలేషియా ఇంజినీర్ ఆత్మహత్యకు సంబంధించిన అంశాలను ఈ విచారణలో పరిశీలించనున్నారు.
కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (కేఎస్టీపీ)లో భాగంగా చేపట్టిన రహదారి అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ వ్యవహారం, ప్రపంచ బ్యాంకు నిధులతో సుమారు రూ.215 కోట్ల విలువైన ప్రాజెక్టు కింద అంగమాలితిరువనంతపురం ఎంసీ రోడ్డు అభివృద్ధి పనులతో ముడిపడి ఉంది. ఈ ప్రాజెక్టులో మలేషియాకు చెందిన సంస్థ, భగీరథ ఇంజినీరింగ్ సంయుక్త భాగస్వామ్య సంస్థ పీఏటీఐబీఈఎల్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రాజెక్టుకు సంబంధించిన అప్పటి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ లీ సీ బీన్ 2006లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్లో అప్పటి పీడబ్ల్యూడీ కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ పేరు ప్రస్తావించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో విజిలెన్స్ ప్రాథమిక విచారణ కూడా జరిగింది. అయితే, ఆ విచారణ మధ్యలోనే నిలిచిపోయిందని, సరైన దర్యాప్తు జరగలేదని తాజాగా ఫిర్యాదు చేసినవారు ఆరోపించారు.











