కోటీశ్వరురాలవ్వాలనే దురాశతో తన ఆరేళ్ల కూతురిని దారుణంగా హత్య చేసిన మహిళా న్యాయవాది, తాను నమ్మిన ప్రియుడి మోసంలో చివరకు కటకటాల పాలైంది. ఈ సంచలనాత్మక ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.
దావణగెరెకు చెందిన ప్రియాంక, ప్రవీణ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తుండగా, భర్త విద్యాసంస్థను నడుపుతున్నాడు. ప్రియాంక బెంగళూరు వచ్చినప్పుడు, తన కాలేజీ స్నేహితుడు, ఒకప్పటి ప్రియుడు మోహన్‌ను మళ్లీ కలిసింది. తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ ప్రియాంకను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ప్రియాంక, భర్తకు విడాకులు ఇచ్చి, చిన్న కూతురు వెన్నెలను తీసుకుని మోహన్‌తో కలిసి బెంగళూరులో సహజీవనం ప్రారంభించింది.
మార్చి 24న చిన్నారి వెన్నెల పుట్టినరోజున, తమ ఏకాంతానికి ఆటంకంగా ఉందని భావించి, ప్రియాంక, మోహన్ కలిసి వెన్నెల గొంతు నులిమి హత్య చేశారు. మరుసటి రోజు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. అనారోగ్యంతోనే మరణించిందని భర్తను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
బిడ్డ మృతిపై అనుమానం వచ్చిన తండ్రి ప్రవీణ్, పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించగా, శ్వాస ఆడక మరణించినట్లు (Asphyxia) తేలింది. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ప్రియాంక, మోహన్‌లే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












