బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారవేత్త జెమ్ వీరమణి కుమార్తె అర్చన వీరమణిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) అధికారులు అడ్డుకున్నారు. సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఆమెను విమానం నుంచి దింపి విచారణ నిమిత్తం కార్యాలయానికి తరలించారు.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అర్చన చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానంలోకి ఎక్కారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకుని విమానంలో కూర్చున్న తర్వాత సమాచారం అందుకున్న ఎస్ఐటీ అధికారులు విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. దీంతో ఆమెను విమానం నుంచి కిందకు దించారు. అనంతరం విచారణ నిమిత్తం చెన్నైలోని ఎస్ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పరిణామంతో సింగపూర్ వెళ్లాల్సిన విమానం సుమారు 12 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. వీరమణిపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు డబ్బు, బంగారం లావాదేవీలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.












