తిరుపతి, 2026-06-25
అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామ శివార్లలో రూ.2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బరాయుడు మార్గదర్శకత్వంలో, ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ఎస్పీ పి. శ్రీనివాస్, అదనపు ఎస్పీ జె. కులశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్లు నిరంతరం నిర్వహించబడుతున్నాయి. ఎర్రచందనం కేసుల్లో పరారీలో ఉన్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపడుతున్నాయి.
ఈ క్రమంలో, 2026 జూన్ 24 సాయంత్రం విశ్వసనీయ సమాచారంతో అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామ పరిసరాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో అనంతపురం జిల్లాకు చెందిన నల్లాని నందకుమార్ (32), నల్లాని జయరామయ్య, బొట్టు రాఘవేంద్రలను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, ఈ ముగ్గురూ ఒక ముఠాగా ఏర్పడి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికి, వాటిని దుంగలుగా మార్చి, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని ప్రధాన స్మగ్లర్లకు అధిక ధరలకు విక్రయించేందుకు ప్రణాళిక రచించినట్లు వెల్లడైంది. నార్పల మండలం పరిధిలోని బొందలవాడ నుండి బొమ్మలాటపల్లి గ్రామానికి వెళ్లే మట్టి రహదారి సమీపంలో జయరామయ్యకు చెందిన పొలంలోని రేకుల షెడ్ పక్కన ఎర్రచందనం దుంగలను డంప్ చేసి దాచిపెట్టినట్లు గుర్తించారు.












