ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో, కామారెడ్డి జిల్లా రైతులు ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టాలని, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామంలోని రైతు వేదికలో జరిగిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వీడియో సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రాష్ట్రంతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ వర్షపాతం తక్కువగా నమోదవుతోందని, గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం సుమారు నాలుగు నుంచి ఐదు మీటర్ల మేర తగ్గిందని కలెక్టర్ తెలిపారు. సదాశివనగర్, పెద్దకొడప్గల్, మహమ్మద్‌నగర్ తదితర మండలాల్లో వర్షపాతం లోటు కారణంగా పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు నీటి నిర్వహణ పరంగా అత్యంత కీలకమని, నిజాంసాగర్ ఆయకట్టుతో పాటు చిన్న చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యతను అంచనా వేసి రైతులు పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే యాసంగి సీజన్లో నీటి లభ్యతను బట్టి వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, జొన్న, మొక్కజొన్న, శనగ, కంది, వేరుశనగ వంటి ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నీటి లభ్యతను అంచనా వేయకుండా అధిక నీటి అవసరమయ్యే పంటలను సాగు చేస్తే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూమి స్వభావం, నేల పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద, ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టాలని, ఇంకుడు గుంతలు, వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ గుంతలు, భూగర్భ జలాల పునరుద్ధరణ నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీరు వృథా కాకుండా సంరక్షించడం ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, భూసారాన్ని పునరుద్ధరించడం, రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగాన్ని తగ్గించడంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించడం, పంట మార్పిడి, పంట వ్యర్థాల నిర్వహణ వంటి శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా ఆయిల్‌పామ్, కూరగాయలు తదితర ఉద్యాన పంటల సాగును పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించుకుంటూ నీటి సంరక్షణ చర్యల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, మార్కెటింగ్ అధికారి రమ్య, సత్యనారాయణ, ఎంపీడీవో, ఎంపీపీ, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.











