చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఆరు నెలలలోపు శిశువుల కోసం తయారుచేసే ఆహార ఉత్పత్తుల్లో అదనంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలను కలపడాన్ని నిషేధించాలని ప్రతిపాదించింది. చిన్న వయసులోనే అదనపు చక్కెరలకు గురికావడాన్ని తగ్గించి, శిశువులకు వయసుకు తగిన పోషకాహారం అందించడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశ్యం.
ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ 2020 నాటి శిశు పోషకాహార నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదాను విడుదల చేసింది. ప్రస్తుతం నిర్దేశిత పరిమితులు, అవసరాలకు లోబడి కొన్ని శిశు ఆహార ఉత్పత్తుల్లో సుక్రోజ్, ఫ్రక్టోజ్ కలపడానికి అనుమతి ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం, ఆరు నెలల వరకు వయసున్న శిశువుల కోసం ఉద్దేశించిన ఉత్పత్తుల్లో ఈ చక్కెరలను అదనంగా కలపరాదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సుక్రోజ్, ఫ్రక్టోజ్ అంటే ఏమిటి
సుక్రోజ్: సాధారణంగా మనం ఉపయోగించే తెల్ల చక్కెరలో ప్రధానంగా ఉండే చక్కెర ఇదే. ఆహార పదార్థాలకు తీపి రుచిని అందించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఫ్రక్టోజ్: పండ్లలో సహజంగా లభించే చక్కెర ఇది. అయితే ఆహార ఉత్పత్తుల్లో అదనంగా కలిపే ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. పండ్లను పూర్తిగా తినడం, వాటి నుంచి వేరు చేసిన చక్కెరను తీసుకోవడం ఒకే విధమైనది కాదు.












