తన సోదరి వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోని యలహంక నివాసంలో కాకుండా వేరే చోట నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కుటుంబ భద్రత, వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళనతో ఆయన ఈ లేఖ రాశారు. ఈ లేఖ న రాసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కీలక విజ్ఞప్తి చేశారు. షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోని యలహంక నివాసంలో నిర్వహించాలనే ఆలోచనను పునఃపరిశీలించి, వేరే వేదికను ఎంచుకోవాలని కోరారు. అక్కడ పెద్ద సంఖ్యలో అతిథులు, వివాహ నిర్వాహకులు, ఫోటోగ్రాఫర్లు, ఇతర సిబ్బంది రాకపోకలు సాగించడం వల్ల తన కుటుంబ భద్రత, వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రత, గోప్యతపై జగన్ ఆందోళన
అంజలి వివాహం గురించి తెలిసి సంతోషించానని, ఆమెకు సుఖసంతోషాలతో కూడిన జీవితం కలగాలని కోరుకుంటున్నానని జగన్ లేఖలో పేర్కొన్నట్లు వార్తా కథనాలు తెలిపాయి. అయితే తాను ప్రస్తుతం నివసిస్తున్న బెంగళూరు ఇంట్లో వివాహం నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో తెలియని వ్యక్తులు ప్రాంగణంలోకి రావాల్సి ఉంటుందని వివరించారు. వివాహానికి వచ్చే అతిథులతో పాటు క్యాటరింగ్, పూల అలంకరణ, కార్యక్రమ నిర్వహణ, వీడియో చిత్రీకరణ, ఫోటోగ్రఫీ సిబ్బంది రాకపోకలు ఉంటాయని తెలిపారు. ఇంటి పరిసరాల చిత్రాలు, వీడియోలు బయటకు వెళ్లడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణాలతోనే వేరే వేదికను ఎంచుకోవాలని షర్మిలను కోరినట్లు సమాచారం.











