కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, డీజేల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజే నిర్వాహకులతో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ ఈ విషయాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డీజేల వల్ల ప్రాణహాని, వినికిడి లోపం, రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరియు పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం డీజేలపై పూర్తిగా నిషేధం విధించినట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత ఏడాది కామారెడ్డి పట్టణంలో డీజేలు లేకుండా సంప్రదాయ డప్పులు, వాయిద్యాలు, నృత్యాలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. డీజే నిర్వాహకులు గణేష్ ఉత్సవ కమిటీల నుంచి అడ్వాన్స్‌లు తీసుకోవద్దని, ఇప్పటికే తీసుకున్న మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని ఎస్పీ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే, సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేసి, నిర్వాహకులు మరియు ఆపరేటర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.












