అన్నమయ్య జిల్లా, పీలేరులో గురువారం సాయంత్రం నాలుగేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితుడు పరారయ్యాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పీలేరు పట్టణంలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో గురువారం సాయంత్రం ఈ దుశ్చర్య జరిగినట్లు సమాచారం. డిగ్రీ కాలేజ్ సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు.
బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు రావడంతో నిందితుడైన బాలుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇటీవల మదనపల్లెలో జరిగిన ఇలాంటి సంఘటన నేపథ్యంలో, పీలేరులో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.












