కడప జిల్లా బద్వేలు రూరల్ పరిధిలో రెండేళ్ల క్రితం జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడికి పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అత్యాచారానికి గురై, సజీవ దహనం చేయబడిన బాలిక కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రేమ పేరుతో ఒక చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న ఘటనకు సంబంధించి కడప జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బద్వేలు రూరల్ పరిధిలోని పి.పి. కుంట అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అత్యాచారానికి గురై, సజీవ దహనానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన బాలికకు న్యాయం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం.ఎ. సోమశేఖర్ ఈ కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించారు. నిందితుడు జక్కల విగ్నేష్ అలియాస్ సాయి (19) కి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.8,000 జరిమానా విధించారు. అంతేకాకుండా, బాధిత కుటుంబానికి తీరని లోటును తీర్చడం ఎవరి వల్లా కాదని గ్రహించి, రూ.5 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.












