ప్రొద్దుటూరులోని రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ భూముల వేలంపాటను అడ్డుకోవడానికి ప్రయత్నించిన రౌడీషీటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఈవో అభ్యర్థన మేరకు బందోబస్తు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ భూముల వేలంపాట సందర్భంగా, ఆలయ ఈవో శ్రీధర్ అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. దొరసాని పల్లికి చెందిన రౌడీషీటర్ పాతకోట వినోద్ కుమార్ రెడ్డి, వేలంపాటను అడ్డుకోవాలని టూరిజం బిల్డింగ్ వద్దకు వచ్చి ప్రయత్నించాడు. పోలీసులు హెచ్చరించినా వినకుండా, అక్కడి పోలీసు సిబ్బందిపై దుర్భాషలాడుతూ తోసేశాడు. వేలంపాట ఆపాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఆలయ ఈవోపై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో అక్కడే ఉన్న పెద్ద బండరాయితో హెడ్ కానిస్టేబుల్ దస్తగిరిపై దాడి చేయబోగా, ఆయన తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వినోద్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిందితుడిపై పొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదై ఉన్నాయి. విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా రౌడీషీటర్లు ప్రవర్తిస్తే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ఏఎస్పీ విబుకృష్ణ ఐపీఎస్ హెచ్చరించారు.












