ఆంధ్రప్రదేశ్‌లో 2024 సంవత్సరం నుండి దళితులకు సంబంధించినట్లు నివేదించబడిన 27 మరణ ఘటనలపై స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) డిమాండ్ చేసింది. రాయచోటిలో బీఎస్పీ శాఖ ఆధ్వర్యంలో దళితుల మారణకాండ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీఎస్పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీ యుగంధర్ అబ్బవరం మాట్లాడుతూ.. దళితుల మరణ ఘటనలపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తేలికగా తీసుకోకుండా ప్రతి కేసులో నిజానిజాలను సమగ్రంగా వెలికితీయాలని డిమాండ్ చేశారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న కేసుల్లో అదే పోలీసు వ్యవస్థతో దర్యాప్తు చేయకుండా, అవసరమైన చోట స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబాలు, సాక్షులకు రక్షణ కల్పించాలని, చట్టపరంగా అర్హత ఉన్న కుటుంబాలకు నష్టపరిహారం, న్యాయ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం వర్తించే కేసుల్లో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దర్యాప్తులో నిర్లక్ష్యం లేదా అధికార దుర్వినియోగం తేలితే బాధ్యులపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతినిధి పత్రం సమర్పిస్తున్నట్లు శ్రీ యుగంధర్ అబ్బవరం తెలిపారు. దళితుల ప్రతి మరణంపై నిజానిజాలు తేలాలి, బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉండాలి అని బీఎస్పీ డిమాండ్ చేసింది. రేపు మదనపల్లెలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న దళితుల మారణకాండ నిరసన కార్యక్రమంలో భారీగా దళితులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అసెంబ్లీ అధ్యక్షులు అబ్బవరం నాగేశ్వర్, పట్టణ అధ్యక్షులు గూటం మహేష్, ఎగువ అబ్బవరం హరిజనవాడ యూత్ పాల్గొన్నారు.











