కామారెడ్డి, 6 September
జిల్లాలో హైవేలు, రహదారుల పక్కన పార్క్ చేసిన లారీలు, టిప్పర్ల నుంచి డీజిల్ దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి డీజిల్, వాహనం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనాలు హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హైవేలపై డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలు, రహదారుల పక్కన పార్క్ చేసిన లారీలు, టిప్పర్ వాహనాల నుంచి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అహ్మద్ ఖాన్ ఫిర్యాదు మేరకు TS12UE1882 నంబర్ గల అశోక్ లేలాండ్ టిప్పర్ నుంచి సుమారు 120 లీటర్ల డీజిల్ చోరీకి గురైన ఘటనపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలను గుర్తించారు. రాత్రి మరోసారి డీజిల్ దొంగతనానికి ఇన్నోవా వాహనంలో బయలుదేరిన నిందితులను పోలీసులు గుర్తించగా వారు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటాడిన పోలీసులు ఉదయం తిరుమనపల్లి రోడ్డుపై ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హైవేలపై పార్క్ చేసిన లారీలు, టిప్పర్ల నుంచి డీజిల్ దొంగిలించి హైదరాబాద్‌కు చెందిన మునీర్ అనే వ్యక్తికి విక్రయిస్తున్నట్లు, గతంలో పలు జిల్లాల్లో జరిగిన డీజిల్ దొంగతనాల్లో కూడా తమ ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో వర్త్య రవి నాయక్ (32), లంబాడి శంకర్ అలియాస్ సక్రియా అలియాస్ మెగావత్ శంకర్ (23), శ్రీనివాస్ చవాన్ అలియాస్ లౌడ్యా శ్రీనివాస్ చవాన్ (27) ఉన్నారు. వీరి వద్ద నుంచి ప్రత్యేకంగా మార్పులు చేసిన టయోటా ఇన్నోవా వాహనం, 20 డీజిల్ క్యాన్లు, డీజిల్ తీసేందుకు ఉపయోగించే పైపు, మూడు సెల్ఫోన్లు, మూడు నంబర్ ప్లేట్లు, రూ.3,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా పనిచేసిన సదాశివనగర్ ఎస్సై పుష్పరాజు, కానిస్టేబుళ్లు అజార్, శంకర్, సీపీఎస్ కానిస్టేబుల్ జొన్నల రవి శ్రీనివాస్‌లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.












