వేంపల్లె రైతు బజార్లో కాంట్రాక్టర్లు రైతులు, చిరు వ్యాపారుల వద్ద అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ దోపిడీ వల్ల రైతులు నష్టపోవడంతో పాటు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లు ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లె రైతు బజార్‌ను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు, రైతులు, వినియోగదారులు, చిరు వ్యాపారుల సమస్యలపై చర్చించారు. రైతులు తెల్లవారుజామున శ్రమకోర్చి పంటను రైతు బజార్‌కు తీసుకువస్తుంటే, కాంట్రాక్టర్లు గేటు ఫీజుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్కో మూటపై రూ. 40, టమోటా బాక్స్‌పై రూ. 20 వసూలు చేస్తున్నారని తెలిపారు. చిరు వ్యాపారుల వద్ద నుండి చిన్న రూమ్‌కు నెలకు రూ. 3,000, బల్లలపై వ్యాపారానికి రోజుకు రూ. 300 చొప్పున గుంజుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ భారం వినియోగదారులపై పడి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ధ్రువకుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బజార్ కాంట్రాక్టర్లకు మేలు చేస్తుందే తప్ప, పేద రైతులు, వినియోగదారులకు ఉపయోగపడటం లేదని విమర్శించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విషయంపై సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ల దోపిడీ నుండి రైతులను, చిరు వ్యాపారులను, అలాగే అధిక ధరల నుండి వినియోగదారులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












