డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరహరి సూచించారు. ఆదివారం సైబర్ నేరాల నివారణ, వ్యక్తిగత సమాచార భద్రతపై ఆయన పలు సూచనలు చేశారు.
ఆధార్, పాన్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, పాస్వర్డ్లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, నమ్మకంలేని యాప్‌లు, ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడం, పోలీసు లేదా ప్రభుత్వ అధికారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం, నకిలీ వాట్సాప్ ప్రొఫైల్స్ ద్వారా నగదు అడగడం వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మొబైల్ ఫోన్లు, బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు ఏర్పాటు చేసుకోవాలని, డబ్బులు పంపే ముందు సంబంధిత వ్యక్తులను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. సత్వర ఫిర్యాదుతో మోసగాళ్ల ఖాతాల్లోకి బదిలీ అయిన డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. పిల్లలు ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించే సమయంలో తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, సైబర్ వేధింపులు, అపరిచితులతో పరిచయాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. పిల్లలకు సంబంధించిన లైంగిక దోపిడీ చిత్రాలు, వీడియోలను వీక్షించడం, భద్రపరచడం, ఇతరులకు పంపడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఇన్స్పెక్టర్ నరహరి పిలుపునిచ్చారు.












