విద్యార్థినులు చదువుపై దృష్టి సారిస్తూ, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రేమ పేరుతో మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలపై మాటలు, పాటల ద్వారా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా ఉపయోగించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, చెడు అలవాట్లకు, నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, సైబర్ నేరాల బాధితులు 1930, మాదకద్రవ్యాల సంబంధిత సమాచారం కోసం 1908, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నంబర్ 8712686094కు సంప్రదించాలని వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, పోలీస్ కానిస్టేబుల్ ప్రభాకర్ మాటలు, పాటలతో అవగాహన కల్పించారు. షీ టీమ్ మహిళా పోలీసు సిబ్బంది డబ్ల్యూపీసీలు సౌజన్య, ప్రవీణలు మహిళల రక్షణ, షీ టీమ్స్ పనితీరు, పోక్సో చట్టం, మైనర్లపై జరిగే నేరాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ బ్లూకోట్స్ పోలీస్ కానిస్టేబుల్ సాయి, హోంగార్డు రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శరత్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.












